Krishnashtami

Festival Description

కృష్ణ జన్మాష్టమి 

   కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు  ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
.
చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం అని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే
'శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే
అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం.
ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.
కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు.
కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది.
కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.
కృష్ణ లీలలకు అంతేముంది? ఎవరైనా, ఎన్నయినా తలచుకోవచ్చు.
కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు.